Monday 26 March 2012

నమ్మకం

  • తీర్ధ స్నానం పాపాన్ని కడిగి వేయలేదు .
  • క్షేత్ర దర్శనం పుణ్యాన్ని ప్రసాదించలేదు.
  • గురు సేవనం గమ్యాన్ని చూపలేదు.
  • భజన ఒక్కటే భక్తికి  పరాకాష్ట  కాదు.
  • పూజ చేసినంతనే పరమాత్మ కనపడడు.
  • ప్రసాదం తిన్నంతనే పవిత్రుడు కాలేడు
  • దానం చేసినంత మాత్రాన ధర్మాత్ముడు కాడు.
  • ధ్యానం చేసినత  మాత్రాన  దైవం దరి చేరడు
  • కారణం పరిపూర్ణ విశ్వాస లోపం.
  •  చేసే పని పై పూర్తి నమ్మకం ఉన్ననాడు  
  • భగవంతుడు పూర్ణ ఫలితం  అందచేస్తాడు

   ఏమండోయ్ ఒక్క నిమిషం,                        మీకు నా గతం స్వగతం చెప్పే అవకాశం ఇవ్వండి.            అనగనగ  ఒక రోజు.....

               నాకు ఉద్యోగం రావడం ఖాయం  అని తెలిసి పోయింది.అయితే  ఉద్యోగం ఎక్కడ, ఎవరి దగ్గర అని తెలియడం లేదు.నాకు ఉద్యోగం  ఇచ్చిన యజమాని చాల కఠినుడు  అని మాత్రం తెలుసు.  అది అనుభవ పూర్వకంగా నాకు ముందే అర్ధమయింది ఎందుకంటే  నేను ఉద్యోగంలో ప్రవేశించడానికి ఆయనే ముహూర్తం పెట్టాడు.
              ఊహించనంత పెద్దది నా ఆఫీసు ప్రాంగణం.ఎంత మంది పని చేస్తున్నారో తెలియనంతఎందఱో కొత్తగా ఉద్యోగానికి అడుగు పెడుతున్నారు మరి కొందరు రిటైర్ అయి వెళ్లి పోతున్నారు వచ్చెవాడి మొహంలో ఏడుపు కనపడుతుంటే వెళ్ళే వారు ప్రశాంతంగా వెళుతున్నారు.

              ఉద్యోగంలో చేరిన మొదటి రోజే నా పై ఇద్దరు అధికార్లు వున్నట్టు తెలిసింది ఇద్దరు నాతోనవ్వుతూ మాట్లాడారు నేనీ ఉద్యోగానికి రావటం వారికి చాల ఆనందంగా వున్నది.నా అసలు యజమాని ఎవరో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి వీరే నా యజమానులు.చేరిన సంవత్సరం చాల అనందంగా గడిచింది.నాకు పని ఏమి ఉండేదికాదు వారు ఇద్దరే
నా పని మొత్తం చూసేవారు వారిని నవ్వించడమే నా పని అయింది.
               మొదటి సంవత్సరంలోనే నేను మొహమెత్తానేమో రెండవ సంవత్సరం నుంచి నాకు రూల్స్ పెట్టారు ఆదరణలో తేడా లేకపోయినా ఆంక్షలు మాత్రం పెరిగి పోయాయి నాకేమో నేను పని చేసే ప్రాంగణాన్ని చూడాలని కోరిక కానీ పై అధికార్లు  అనుమతి కొంత వరకు మాత్రమే ఇచ్చారు . వారు అనుమతించినంత వరకు మాత్రమే నాలుగు అడుగులు వీయగాలిగేది నేను కొద్ది కొద్దిగా మాట్లాడడం మొదలు పెట్టాను దాంతో వారు నాకు పాఠం నేర్పించడం మొదలు పెట్టారు.

               ఇప్పుడు నాకు పని పెరిగింది పైన అధికార్లు విధించే పనిష్మెంట్ పెరిగింది ఐన నా అసలు యజమాని ఇంతవరకు కనపడలేదు తరువాత తెలిసిన విషయమేమిటంటే ఇచట కొన్ని వేల మంది కాదు కాదు లక్షలమంది పని చేస్తున్నారు ఎవరికీ ఏవి ఎప్పుడు ముట్టాలో ఆ సమయనికి సరిగా ఆ వ్యక్తికి చేరేవి. శిక్ష కూడా అలాగే వుండేది ఎవరికీ ఎప్పుడు మూడుతుందో  తెలియని    పరిస్థితి. ఉద్యోగంలో చేరడం మాత్రమే మన ఇష్టం చేరిన తరువాత అంతా ఆయన ఇష్టం. ఉంచ దలచుకున్న వాళ్ళను వుంచుతాడు తీసివెయ దలచుకున్న వాళ్ళని నోటీసు లేకుండ తీసివేస్తాడు అందుకే మా యజమాని కఠినాత్ముడు.
                ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇన్ని యేళ్ళలోనూ నా అసలు యజమానిని చూడలేదు నాకు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన కనపడకుండా కనీసం మాట వినపడకుండా అన్ని పనులూ ఆగకుండా జరిగి పోతున్నాయి. ఆయన చాలా గొప్పవాడని
తెలిసింది  నాలాంటి సామాన్యులు తొందరగా కలవలేరని నాకు అర్ధమయింది నా పై అధికార్లు నాకు కోరిన వసతులు కల్పించడం మొదలు పెట్టారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి.

              అకస్మాత్తుగా ఒక రోజు నాపై అధికార్లు వచ్చి నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. నాకు తోడుగా ఒక వ్యక్తిని నియమించారు ఆ వ్యక్తి నాకు అన్ని విధాలుగా సహాయం చేసేవారు నేను మరచిన బాధ్యతలు గుర్తు చేసేవారు మా ఇద్దరి అవగాహనవల్ల  పని సజావుగా సాగిపోతోంది.

              ఇందులో మరియొక సంతోషకరమైన వార్త, నా పై ఇద్దరి అధికార్లకు ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ కుడా మేము ఇద్దరం కష్టపడి పని చేయటంవల్ల వచిందని తెలిపారు ఆ ప్రమోషన్ మాకు కూడా వర్తించింది ఇప్పుడు మేము ఆ ఇద్దరు అధికార్ల స్థాయికి చేరాం  వారు ఇంకా పై స్థాయికి వెళ్లారు.  మేము నవ్వుతు మరియోకడికి స్వాగతం చెప్పాం. ఇలా మరికొన్ని సంవత్సరాలు గడిచాయి.
               ఇన్నాళ్ళలో నాకు తెలిసింది  ఏమిటి అంటే  ఈ ప్రాంగణంలో పనిచేస్తున్న ఎవ్వరు కూడా అసలు యజమానిని చూడలేదని,.కనీసం  మాట్లాడియున్దలేదని ఐనను కొందరు ఈ యజమాని మా మతం వాడని,మా కులం వాడని మా మాటలు మాత్రమే  వింటాడని ప్రచారం మొదలు పెట్టారు.

              ఇంకా మరికొందరు ఒక వ్యక్తిని చూపి ఈయన అసలు యజమాని అంతటి వాడని ఈయనకు అసలు యజమానికి భేదం లేదని అన్ని రకాల సేవలు చెయ్యడం మొదలుపెట్టారు.ఇంతలో మరికొందరు కొత్త నినాదం మొదలుపెట్టారు .అసలు ఈ ప్రాంగణానికి యజమాని అంటూ ఎవరు  లేరని  ఎవరికి వారు యజమాని అని చెపుతువుంటే నాకు చాల భాద కలిగింది.యజమాని అంటూ లేకుండా ఈ ఆఫీసు ఎవరు మొదలు పెట్టారు?  నా  పిచ్చి గాని   ఆయనకు లేని భాద నాకెందుకు?  ఇలా ఉలుకు పలుకు లేకుండా వున్నాడు  అంటే  ఏదో ప్రళయం  రాబోతున్నదేమో అని భయం గాను ఉంది. ఐనను నా భాద్యతను  మరువలేదు.
               ఈలోగా .నా ఫై అధికారులు  నన్ను వదిలి వెళ్లిపోయారు.  వారి పదవులలోకి మేము వచ్చాం. అదేమీ చిత్రమో గాని ఎంత కష్టమొచ్చినా అంత తొందరగా మరిపింప చేస్తుంది ఈ ప్రాంగణం.
అదే విధంగా సంతోషంగా వున్నమనుకునే లోపల అనుకోని అవాంతరాలు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నాకు నా జీవితంపై విసుగు కలుగుతోంది నా బాధ్యతను సక్రమంగా నేరవేర్చినా కూడా నా యజమాని నాకు కనపడకపోవడం నాకు నిరాశను కలగ  చేసింది.
              మరి కొన్ని సంవత్సరాలు గడిచాయి. నా క్రింది ఉద్యోగి పూర్తిగా నా బాధ్యతలు అందుకున్నాడు. ఈ ఆఫీసు ప్రాంగణం ఎప్పుడు వీడ వలసి వస్తుందో తెలియడంలేదు. ముందే చెప్పానుకదా చేరడం , వదలడం అంతా ఆయన ఇష్టమే. ఇంక వుద్యోగంపై విసుగు కలుగుతోంది, వుద్యోగం వదిలి వెళ్ళమంటే వెళ్ళడానికి సిద్దంగా వున్నాను. నా క్రింది ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి మరొకరిని జత కలిపాను. నాకు ఒకటే కోరిక నా అసలు యజమానిని చూడకుండా వుద్యోగం వదలలేను. అందుకే నా సహోద్యోగితో చెప్పాను , ఆయన ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నానని, తెలుసుకునేదాకా నా ప్రయత్నం వదలనని తెలిపాను. అంతే ఆరోజు నుంచీ ఆ ప్రాంగణం అంతా వెతకాలని బయలుదేరాను అలా వెతుకుతూనే వున్నాను ఎందుకంటే ఆ ప్రాంగణానికి అంతులేదు.

               ఆ విధంగా అహోరాత్రాలు సాగాయి. అన్న పానీయాలు మరిచిపోయాను, ఒకటే ధ్యాస, ఒకే ఆలోచన ఆయనెవరో తెలుసుకోవాలని. ఈ విషయంలో నేను ఓడి పోతానేమో నాకు తెలియదు కానీ నా ప్రయత్నం ఆగలేదు . ఒకటే ధ్యాస ఒకటే ఆలోచన ఇలా మరికొన్ని సంవత్సరాలు గడిచాయి నా శక్తీ క్షీణించి పోయింది నేను ఆయనను కలుసుకోవడం మాట అటుంచి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కూడా కష్టమయింది. నేను పూర్తిగా అలసిపోయాను.

             అటువంటి క్షణంలో ఒక అద్భుతం జరిగింది ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు విశాల నేత్రాలతో ఓ ఆజానుబాహుడు నా ఎదురుగా నిలబడి నా హృదయాన్ని తన చేతితో స్పృశించాడు. అంతే కోటి విద్యుత్తరంగాలు నాలో ఎగిసి పడ్డాయి కళ్ళ వెంట కురుస్తున్న ఆనంద భాష్పాలతో తడిసిపోతూ నోరు పెగల్చుకుని 'ఎవరు మీరు?' అని అనాలనుకున్నాను ఇంతలో నువ్వు వెతుకుతున్న యజమానిని నేనే  ఇంతకాలం నీలోనే వున్నాను, నీలోనే కాదు అందరిలోనూ నేనే వున్నాను నీకూ నాకూ బేధం లేదు అన్న మాటలు వినపడ్డాయి.  అంతే అంతులేని బ్రహ్మానందం నా సొంతమయింది తెరలు తెరలుగా సముద్రపు అలలుగా నా ఆనందం పెల్లుబికింది . శివోహం శివోహం అని నా హృదయం ప్రతిధ్వనించింది సమస్త విశ్వం నాలోనే విలీనమయింది. ధన్యోస్మి.

అమ్మ

ఓ ప్రభూ,
మా అమ్మ మేనకమ్మ ముద్దులపట్టి
హిమవంతుని గారాల పుత్రి మా పార్వతి
బంగారు గదుల్లో వూయలలూగింది
పట్టుపరుపులపై పవళించేది  మా తల్లి
మయూరాలను చూస్తూ నడకలు నేర్చింది
మంచు ముద్దలతో బంతాటలాడేది
పసిడి కొండలను చూసి పరవశించే మా అమ్మ

పచ్చిక బయళ్ళమీద పరుగులు తీసేది
పూదోటల మధ్య దోబూచులాడే మా తల్లి
పచ్చని చెట్లఫై  మంచు ముత్యాలు వెతికేది
అందమనే దేవతకు అసూయ కలిగించే మా అమ్మ
పాదాలు కందకుండా  ఉండాలని  పుడమి చూసేది

 అతి వయ్యారంగా  సాగే ఆమె నడకను చూసి
అక్కడి నదులు  నవ్వుతూ ఓటమినొప్పుకునేవి
ఎండ కన్నెరగని మా తల్లిని ఏమీ మాయ చేసావో
నిను చూసీ చూడగానే సర్వం మరిచిపోయింది 
అలసటంటూ  అసలు తెలియని మా తల్లి
నిన్నందుకోవాలని పెద్ద తపస్సే చేసింది
ఆమె తపస్సు చూసి అందరూ నివ్వేర పొతే
నదీనదాలు నిక్కి నీలుక్కోని నాపరాళ్ళయ్యాయి
మునులు ఆమె తపస్సును  మహా  మెచ్చుకుంటే
మూగజీవాలు మౌనంగా చూస్తూ రోదించాయి
నెమళ్ళునడకను మరచి నీరసింఛి పోతే
నాలాంటి  సాధుజనులు సర్వం మరిచారు
పరవశించి పరిమళించే పూల మొక్కలు
పలకరించే దిక్కు లేక పక్కకు వాలాయి
మూగగా బాధననుభవిస్తూ మంచు పర్వతాలు
మునపటిలా  మెరవటం  మర్చిపోయాయి
ఇన్ని పరిణామాలు చూస్తూ నేనున్డలేక
ఓ నీలకం
ఠా నిను చూద్దామని వచ్చాను
చూసిన క్షణంనించే మనసు మొద్దుబారి
మాట బయటకు రాక మూగవాడినయాను
నిను ఏమని నేను వర్ణించ గలను?
ఎవరిని నీ గురించి ప్రశ్నించగలను ?
ఒంటి నిండా విభూతిని ధరియించి నీవు
మంచుపర్వతాన్ని మించియున్నావు
కనులకు భీతినిచ్చు కాలనాగులను
కంఠాభరణంగా చేసుకొని తిరుగుతున్నావు

సర్వజీవుల విశ్రాంతి స్థలమగు స్మశానమును
నివాసంగా చేసుకొని మసలుతున్నావు
పట్టు పీతాంబరమువలె పులిచర్మం చుట్టుకొని
పిశాచగణాలతొ పాటు  నీవు  పయనిస్తున్నావు
ప్రపంచాన్ని భస్మిపటలం చేయగలిగినట్టి 
ప్రళయాగ్నిని మూడో నేత్రంగా మూసివుంచావు
పట్టు వీడిన క్షణం ప్రాణం హరింపచేయగల
పె
ద్ద త్రిశూలం చేత ధరించి తిరుగుతున్నావు
భీకరమగు ధ్వనితో భయాన్ని కలిగించు
ఢమరుకముతో  నీవు ఆడుతున్నావు

ఒంటి కన్ను వాడు, మూడు కాళ్ళ వాడు
ముక్కు మూతి లేని వాడు ఒకరు కాదు ఇద్దరు కాదు
వేల వికృత గణాలు నీ చుట్టూ చేరి  వున్నాయి
పరమేశ్వరా పురుషుడినైన  నాకే
పరమ భీతిని కలగచేయుచున్నావు
సకల సద్గుణ రాశి  మా  సొగసుల తల్లి
సాత్విక స్వరూపిణి ఐన మా అమ్మ 
పతిదేవుడుగా నిన్ను ఎలా  కోరుకుందో కదా
నిజం  తనకు తెలియకనేమో లేక
నిజరూపంలో నిన్ను కానకనేమో
నిద్రాహారాలు మాని నిను పూజిస్తుంది
నీకూ నా తల్లికి సరికాదని నీవైనా చెప్పాలిగా
అయినను నిన్నని ఏమి లాభం
నా తల్లి కళ్ళని  నీ విభూతి కప్పింది
సర్వం నీవే కావాలని సన్నిహితులను వదిలేసింది 
సామాన్యుడనైన నా మనవి విని  సమ్మతిస్తుందా
సత్వరం ఈ విషయం అమ్మకు తేలియజేస్తాను
సమస్త విధాలుగా ప్రయత్నించి అమ్మను  నే ఒప్పిస్తాను 
సదాశివా నిను సంపూర్ణంగా మరిచేటట్టు చేస్తాను
ఆవేశంగా అడుగులు ముందుకు వేసాను
ఆలస్యం చేయక అమ్మ దగ్గరకు పరుగు తీసాను
అందరిని కలుపుకొని  మరీ ప్రయత్నించాను
అనుభూతి చెందిన విషయాలు అన్నీ వివరించాను
ఆదిశంకరుడి  అనుగ్రహం అవసరం లేదన్నాను
అసలు ఆ సాంగత్యం నీకు సరిపడదన్నాను
అన్ని మాటలు ఆసక్తిగా ఆలకించింది అమ్మ
అరనిమిషం పాటూ  అందరిని చల్లగా చూసింది
ఆలోచనలకు అందనివ్వలేదు ఆమె అంతరంగం
అంతలో ముద్దులొలికే చిరునవ్వుతో నా తల్లి
మృదు మధురంగా మాట్లాడసాగింది
మాటలను ముత్యాలపేరుగా మార్చి వేసింది

ఓ సాధుజనులారా !                       
సంభోదన సున్నితంగా మనసును మీటింది
స్వీకరించండి నా సాదర ప్రణామాలు
సదాశివుడు సామాన్యుడు కాదు
సమస్త లోక జన పూజితుడు

 
సృష్టి స్థితి సంహార కారకుడు
సర్వం తానై నిండి వున్నాడు
సత్ అసత్ గా నిండి ఉన్నవాడు
పంచభూత పరిపాలకుడు
పరబ్రహ్మగా ప్రకాశించేవాడు
ప్రణవనాధ స్వరూపుడు
పుట్టుకంటూ లేని పరమాత్ముడు
సర్వ జగత్తును ఉదరమందు కలిగినవాడు 
స్మరణ మాత్రం చేతనే సర్వశుభాలనిచ్చేవాడు
సకల ఐశ్వర్యములను చేకుర్చేవాడు
స్వర్గ మోక్షాదులను ప్రసాదించువాడు
...స్వరం గంభీరంగా సాగిపోతుంది
అఖిల భువనములకు అధిపతి
అనంత మైనటువంటి తేజోమూర్తి
అసలు అవగతం కాని విలక్షణ మూర్తి
అపారమైనటువంటి కరుణామూర్తి
అవధులు లేనటువంటి అద్భుతమూర్తి

అందరిలోకి ఆది పురుషుడైనటువంటి 
ఆయనను అర్ధం చేసుకోవడం
అందరివల్లా కాదు

సద్యోజాత, వామ, అఘోర ,తత్పురుష
ఈశాన ముఖాలుగా కలిగిన పరబ్రహ్మ
శ్రీమహావిష్ణువుకు ప్రియమైనవాడు
 
శ్రీకరుడు, శుభకరుడు, శివశంకరుడు
సామవేద ప్రియుడు,శశి శేఖరుడు,
నాదశరీరుడు, నాట్యవినోదు
డైనటువంటి 
ఆయన శివస్వరూపం తెలుసుకోవడం కష్టం
అయినను నాకు తెలిసింది చెపుతాను అంటూ
అమ్మ ఆనందపారవశ్యంతో చెప్పసాగింది
అన్ని ఆలోచనలకు మూలమైనటువంటిది
అందరిని అథపాతాళానికి త్రోక్కివేయగల
కామాన్ని రూపంగా కలిగినటువంటి
మన్మధుడిని దహించివేసేది మూడవకన్ను
కామంవల్ల వచ్చే క్రోధాన్ని అదుపులో
వుంచుకోవాలంటూ సూచించేదే కాలసర్పం
సత్వ, రజ, తమో గుణాలకు
అతీతమైనటువంటి జీవుడు ఎక్కడా లేడు
ఆ గుణత్రయంలోని ఏకత్వమే త్రిశూలం
మనో నిగ్రహం సాధిస్తే సహస్రారం చేరగలమని
సూచించేది శిరమున గల నెలవంక
అహాన్ని జయిస్తేనే
శివోహం గ్రహిస్తాడని
సందేశ రూపకంగా
తెలిపేదే ఆడంబరంగా  కట్టుకున్న వ్యాఘ్ర  చర్మం
మనలోని భయాలను పోగొట్టి
వివేకాన్ని మేలుకోలిపేది,
మహేశ్వరా అని స్మరిస్తేచాలు
మనలను కాపాడటానికి ముందుంటానని
తెలిపేది ఢమరుక నాదం
కాల చక్రంలో కలసిపోయిన
సృష్టికర్త  బ్రహ్మల  సమూహాన్ని
తెలిపేదే ఆ కపాలమాల
సకల ఐశ్వర్యములను సామాన్యంగా
భావించాలని తెలియచేసేది విభూది
అన్నీ వున్నా ఆఖరి గమ్యస్థానం
అదేనని తెలియచేసేది  స్మశానవాసం  

అంతెందుకు ఆయన సాక్షాత్ సృష్టి స్వరూపుడు


శబ్ద స్వరూపమైన  'ఢమరుకం'  'ఆకాశ' తత్వం
శబ్ద,స్పర్శ సంబంధమైన  'ప్రణవం' 'వాయు' తత్వం
శబ్ద,స్పర్శ,రూప తత్వమైన  'త్రినేత్రం'  'అగ్ని' తత్వం
శబ్ద,స్పర్శ,రూప,రస తత్వమైన 'గంగ'  'జల' తత్వం
శబ్ద,స్పర్శ,రూప,రస,గంధ రూపమైన 'విభూది'  'పృథ్వి'  తత్వం
పంచన్మాత్రలు  రూపంగా కలిగిన ఆ పరమేశ్వరుని
వర్ణించటం పరమపవిత్రమైన వేదములవల్లే  కాలేదు
సామాన్యులకది సాహసమైన విషయం
అంటూ శివతత్వం వర్ణించిన ఆ పరాశక్తి మాటలకు


నలు దిక్కులా ఓం  నమఃశివాయ అను
స్మరణతో సర్వజగత్తూ  ఊగిపోయింది
సదా నీ నామస్మరణలో మునిగిపోయింది
నా తప్పును తెలియచెప్పిన నాతల్లికి
శతకోటి ప్రణామాలు తెలియజేసాను
అయీనను ఇందు నా తప్పేమీ లేదు ప్రభూ
అమ్మ చెప్పితేనే గదా  అయ్య గురించి తెలిసేది
అసలు గుట్టు విప్పితేనే కదా అంతా అర్ధమయ్యేది
నీ గురించి నిష్టురమాడితే కదా నిజమేంటో తెలిసింది
నాలాంటి అల్పులకు పూర్తి కనువిప్పు కలిగింది
నేటినుంచి నీ నామస్మరణమే నా శ్వాసగా
నీ సేవనమే నా ప్రాణంగా జీవిస్తాను

శివశివ శంకర  హరహర శంకర
జయజయ శంకర  భోలా శంకర
అను నీ ధ్యానం  నన్ను నీ వాడను చేసి 
సమస్త మంగళాలను కలగచేయాలని
సదాశివా నిన్ను
ఈ హరిశంకరుడు శరణు వేడుకుంటున్నాడు
ఓం నమఃశివాయ.
అనుకోకుండా ఒకరోజు

అనుకోకుండా ఒకరోజు

దారిలో నడుస్తూ ఉన్నప్పుడు  కాలికి ఏదో మెత్తగా  తగిలింది
అదేమిటో అని వంగి చూసేసరికి చిన్న పాము పిల్ల  జానెడు కూడా లేని దాన్ని చూసీ ప్రక్కనుంచి  వెళ్ళిపోయాను. కానీ అది నల్లగా  వుండటం  చిన్న గీతలు ఉండటం  గుర్తుకు వచ్చి మనసులో ఏదో శంక .
పాములు పగ పడతాయా ? కానీ అది చిన్నదేగా  దానికి భయపడక్కరలేదు.అనుకుంటూ వదిలేశాను .
           ఇంటికి వచ్చిన తరువాత కూడా  అదే భయం  మళ్లీ  పనిలో పడి మర్చిపోయాను .
రాత్రి  నిద్దరలో కూడా అదే  వచ్చింది. మరునాడు మాములుగా అదే దారిలో వెళుతున్నప్పుడు  నా వెనుక ఏదో కదలినట్లు అనిపించింది .చిన్నగా వెనుకకు తిరిగి  చూసాను అదే పాము  నా వెనుకగా  వస్తున్నట్లు  అనిపించింది  అది నిన్నటి కన్నా  కొద్దిగా  పెద్దగా  ఉంది . నన్నే  చూస్తున్నట్లుగా ఉండే సరికి  నాలో భయం  పెరిగింది  దాని నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను
        సాయంత్రం ఇంటి దగ్గరికి వచ్చేసరికి  తలుపు దగ్గర ఏదో కదులు తున్నట్లు  కనపడింది  అవును అదే
మరికొంచం పెద్దగా   మోచేతి  అంత పొడవుగా   తలుపు ప్రక్కనే ఉంది .నాకు పూర్తిగా అర్ధమై పోయింది
అది పగ పట్టింది  అందుకే నా ఇంటికి వచ్చింది. ఎలా? తప్పించుకోవడం  అనుకుంటూ పరుగెత్తడం మొదలు పెట్టాను  నేను ఎంత వేగంతో వెళుతుంటే అంతే వేగంగా రావటం మొదలు పెట్టింది
                     అలా పరుగేడుతునే వున్నాను ఊరూ  దాటాను  కొండలు దాటాను వాగులు దాటాను
       అది క్షణక్షణం పెరుగుతూ  నా వెంట పడింది. ఇపుడు అది  పది అడుగుల కన్నా పొడుగు ఉంది
       అలా ఎంత దూరం పరుగేట్టానో  ఎన్ని రోజులు పరుగులు తిసానో  తెలియడం లేదు  బాగా అలసిపోయాను
               ఇంతలో నాకు ఎదురుగ  ఒక పెద్ద పర్వతం కనపడింది  దాన్ని ఎక్కడం మొదలు పెట్టాను అలుపుతో ఆయాసంతో అతి కష్టం మీదకొంత దూరం  ఎక్కి  కొద్దిగ వెనుతిరిగి  చూసాను .అంతే నా భయం రెండు రెట్లు పెరిగింది  కారణం అది  అతి పెద్దగ  రెండు తలలతో  నావైపుకు  చాలా వేగంగా  రాసాగింది .నేను ఇంకా వేగాన్ని పెంచి  కొండ పైకి చేరాను .
               అక్కడ ఒక గుడి కనపడింది అందులోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను.అది కృష్ణుని దేవాలయం. కానీ అక్కడ ఎవరు లేరు  గర్భ గుడి తలుపులు తెరిచే ఉన్నాయి.పరిగేట్టుకుంటూ వెళ్లి ఆ కృష్ణుని పాదాలు పట్టుకున్నాను
              ఆ పాము గుడి   ధ్వజ స్థంభం దగ్గర ఆగిపాయింది  ఐదు  తలలతో  అతిభీకరంగా  బుసలు
కొడుతూ నన్నే చూడసాగింది ధ్వజ స్థంభం  ఎత్తును దాటి ఉంది .
                నా కళ్ళవెంట  నీరు  ధారగా కారుతుంది  పాము పగ పడుతుంది  అని విన్నాను గాని  ఇలా క్షణ క్షణము పెరిగిపోవడం  భీకర రూపంలో వెంట పడటం నేనెప్పుడు వినలేదు నాకు  ఇంక దిక్కు లేదు
ఆ కృష్ణుడే నన్ను కాపాడాలి  అనుకున్నాను .
              హే కృష్ణా, మాధవ,గొవిందా కాళియున్ని దండించి గోప బాలకులను కాపాడావు  నన్ను కూడా ఈ గండంనుంచి కాపాడు తండ్రి  నాకు వేరే దిక్కు లేదు అని విలపించాను.ఆ బుసలు విని విని  నేను బ్రతికి ఉండలేను  అంటూ పెద్దగా రోదించాను.
            ఇలా కొన్ని గంటలు గడిచాయే కానీ ఆ భగవంతుడు  కరుణించలేదు. ఇంక ప్రాణాలు దక్కవనుకొని నిర్ణయించుకొన్నను  ఎక్కడో ఆశ  నన్ను ఆ పాదాలు వదలనియటంలేదు  ఏమో కృష్ణుడే  ఇలా నిర్ణయం  చేసాడేమో,లేక పొతే  దారిలో ఎన్నో గుడులు ఉండగా  నేను ఈ కొండ పైకి రావడం  ఏమిటి?ఇక నన్నెవ్వరు  కాపాడలేరు  అని నిర్ణయించుకొన్నాను .
  ఇలా మరికొన్ని గంటలు గడిచాయే కానీ ఆపాము నుంచి కాపాడుకొనే మార్గం తెలియలేదు .ఇంతలో గుడి గోడలు కదలటం మొదలు పెట్టాయి.ఆ పాము గర్భ గుడి తలుపులు  దాటి రావడానికి  ప్రయత్నం  చేస్తుంది  అని అర్ధమైంది నన్ను రక్షించుకోవడానికి అక్కడ ఏమీ మార్గం కనపడటంలేదు ఒక కర్ర ముక్కైనా దొరుకుతుందేమో అని చూసాను దాని పది తలలను గర్భగుడిలోకి పెట్టడానికి ప్రయత్నం చేయ సాగింది అయిపొయింది ఇక నాకేమి దారిలేదు కృష్ణా నిన్ను చేరుకుంటాను అనుకుంటూ
 
ఉండగా కృష్ణుని చేతిలోని పిల్లనగ్రోవి క్రింద పడింది అదే భగవంతుని ఆదేశంగా భావించి  చివరి ప్రయత్నంగా  పన్నెండు అంగుళాల పిల్లనగ్రోవిని తీసుకొని దానిని కొట్టడానికి ఒక అడుగు ముందుకు వేసాను అంతే  పాము ఒక్కసారిగా వెనక్కు వెళ్ళింది నేను దాని వైపు అడుగులు వేసాను,  నేను గర్భ గుడి బయటకు రాగానే  ఆ పాము ఒక్కసారిగా  ధ్వజ స్థంభం నుండి క్రిందకి దూకింది  నేను అడుగులు వేస్తున్నకొలది  అది నాకు దూరంగా జరగటం మొదలు పెట్టింది  నాకు తెలుసు  అది వెనుకకు  వెళ్ళినట్లే వెళ్లి నామీద  పడుతుందని,అయిన సరే మొండి ధైర్యం తో ముందుకు సాగాను.
       ఇంతలో అశ్చర్యంగా దానికి రెండే తలలు కనపడ్డాయి  ఆ పాము వేగంగా కొండ దిగటం మొదలు పెట్టింది  నేను దాని వైపు వేగంగా పరుగెత్తాను .అది ఇంక వేగంగా వెళ్ళసాగింది నాలో ఎక్కడలేని మొండి ధైర్యం  నేను పాము వెంట పరుగుతియటం ఆపలేదు . ఇలా నేను ఊరువైపు దానిని తరమటం ,అది అంతే వేగంతో పరుగెత్తడము.  ఆశ్చర్య కరమైన విషయం  ఏమిటంటే దాని పొడవు  అంతకంతకు తగ్గటం మొదలుపెట్టింది  ఇలా  నేను ఇంటి దాక  దానిని తరిమాను.
       ఇంటి దగ్గరికోచ్చెసరికి  పాము పొడవు అరచెయ్యి  అంత అయ్యింది  అయిన  నేను ఊరుకోలేదు దానికి మరింత
దగ్గరగా జరిగాను .అది బొటనవేలంత అయ్యింది దానిని చేతిలోకి తీసుకొన్నాను
  అదిప్పుడు చిన్న పురుగులా  కనపడసాగింది నా పిడికిలి బిగుస్తున్నంతలోనే అది ఇంకా చిన్నగా
సూక్ష్మ క్రిమిగామారి  గాలిలో కలసి పోయింది నాకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది  ఆ పాము మరేమిటో కాదు నాలోని భయమేనని ఆ పిల్లనగ్రోవి మరేమిటో కాదు భగవంతుడు నాలో కలిగించిన ఆత్మవిశ్వాసం అని. అంతే అంతులేని ధైర్యం నాసొంతం అయ్యింది ఎదురుగ నా ఇంటి లోని కృష్ణుడు  నన్ను నవ్వుతూ   చూస్తున్నాడు.

ఓ ప్రభూ
పసితనంలో  పాకుతూ  దేకుతూ
పట్టుకున్నవన్ని నోటిలో పెడుతూ        
అమ్మమాటలకూ ఊ కొడుతూ 
నాన్న కోసం  పరుగులెడుతూ
బోసినవ్వులతో ఆనంద పడుతూ
ఆశుద్దాలను ఏకం చేస్తూ ఆటలాడుతూ 
అమాయకంగా కాలం గడిపేసాను
                                               
                                               

కొద్దిగా వయసు పెరిగింది ..
ఇంగ్లీష్ చదువు
ఆరంభమైంది  పుస్తకాలతో కుస్తీ మొదలైంది            
పక్క పిల్లలతో పోటి అలవాటైంది   
అన్నివిషయాలఫై ఆసక్తి మెరుగైంది
ఆలోచన పెరిగింది ఆవేశం పెరిగింది
అతివేగంగా ఆ సమయం కరిగిపోయింది
                                                  



కొంతకాలానికి బాల్యానికి విడ్కోలిస్తూ
కాలేజి జివితాన్ని కాచి వడపోస్తూ
పెద్దల మాటను పెడచెవిన పెడుతూ
అమ్మాయి ప్రేమ కోసం ప్రయత్నిస్తూ
అసలు జీవితం అదేనని తలపోస్తు
ఆమెకోసం అహర్నిశలు కలువరిస్తూ             
అన్నిమరచి నేను పెద్ద తపస్సే చేశాను
ఆ కాలం కలసిరాక చివరకు వదిలేసాను      
                                                  

కొద్దిగా వయసు ముదిరింది 

 బుద్ది మారింది  బాధ్యత పంచుకోమని బలవంతం మొదలైంది   
ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ తప్పనిసరైంది 
 
బవిష్యత్ ఏమవుతుందోనని భయం పెరిగింది          
కాళ్ళు పట్టి కాకా పట్టగా ఉద్యోగం దొరికింది
నా జీవితంఫై నాకు ఒక ఇష్టం ఏర్పడింది         
                                                   
 
పెళ్ళివయసు వచ్చింది అంటూ
పెళ్ళాం కోసం పగటి కలలు కంటూ
ప్రేమించిన దానిని గుర్తు చేసుకుంటూ
వచ్చే అమ్మాయికి ఈ అర్హతలు ఉండాలంటూ            
వయసు పోతుందేమో అని అన్నిటికి ఒప్పుకుంటూ
దొరికిన అమ్మాయినీ  పోనికుండా పట్టుకుంటూ 
దయతో మమగారిచ్చినవి పుచ్చుకుంటూ 
సంసారంలోనే స్వర్గం చూసుకుంటూ
సమయాన్నంతా సందడిగా గడిపాను              
                                             

పిల్లల రాకతో నా సంసారం పెద్దదైంది    
ప్రమోషన్ వచ్చి నా హొదా మారింది
నేనున్డేచోట నా  పరపతి పదిన్తలైంది                    
నాకు డబ్బంటే మోజు మొదలైంది
కనిపించని కష్టం ఇష్టంగా మారింది
సుఖం ఎక్కువైంది రోగం బరువైంది
సమయమెలా సాగిందో తెలియకుంది       
                                                   

పిల్లలు పెద్దవాల్లయ్యారని మురుస్తూ
వారిని చెడిపోకుండా చూస్తూ
నా అనుభావాలను వినిపిస్తూ 
ప్రేమ పేరెత్తకుండా కాపలా కాస్తూ
చదువే సర్వస్వం అని భోదిస్తూ
నే చేసిన పనులను మరుస్తు
అతి సాధారణంగా ఆ సమయం గడిపేసాను
  
పిల్లలు పెద్దమనుషులయ్యారు                                        
నా బాధ్యతలనుంచి  తప్పించారు
నన్ను ఇంటి కాపలవాడిగా మార్చారు
ఓ మూలగా మౌనంగా ఉండమన్నారు 
ముసలాడివి అని మరి చిన్నచూపు చూసారు
సంపాదించినదాన్ని  తగలేస్తున్న
కొడుకుల్ని ఏమనలేక, కోడళ్ళకు చెప్పలేక
చిర్రుబుర్రు మాటలు వింటూ, చివాట్లు తింటూ
చివరి దశకు నే చేరుకున్నాను                 
                                               

ప్రస్తుత పరిస్తితి  నాకు అర్ధమైంది
నా వాళ్లకు నా శరీరం భారమైయ్యింది
నే సంపాదించింది మాత్రం ప్రియమైంది 
నాకంటూ ఎవరు అని ఆలోచన తట్టి లేపింది
నిజమైన  ఆనందం కోసం అన్వేషణ
మొదలైంది
అప్పటికే అంతా ఆలస్యమైయింది
వృద్దాప్యం శరీరానికి భారమైంది

వూహ తెలిసినప్పటినుండి నిన్నెప్పుడు నే కొలవలేదు
కష్టాలు వచ్చినపుడు కాపాడమనీ  కోరుకోవడం తప్ప
అమ్మ రూపంలో లాలించినా
ఆలి రూపంలో ప్రేమించినా
డబ్బు రూపంలో అన్ని ఇచ్చినా 
అంతా నీ అనుగ్రహం అని అర్ధం కాలేదు         
కాలం కలసినంత సేపు కన్ను మిన్ను కానరాలేదు    
కనీసం నిన్ను రోజు తలచుకోలేదు
ఆస్థి అంతస్తు అన్ని ఇచ్చానని
నన్ను ఎవరు గుర్తించటం లేదని
నిత్యం ఏడుస్తున్న నాకు
నా ఏడుపుకు కారణమైన నా పిల్లలకు
 పెద్ద తేడా ఏముంది?                        
                                                    

 నేడు నీకు నేను ఏమి చెయ్యగలను?
నీ కోవెలకు వద్దమంటే కాళ్ళు కదలవు
నీ కధలు చదువుదామంటే కళ్ళు కనబడవు
నీ పురాణాలు వినడానికి చెవులు పనిచేయవు
నీకు నమస్కరించాలంటే  చేతులు లేవలేవు
నీ నామం పలుకుదామంటే నోరు పెగలదు
నిత్యం నిన్నే తలుచుకునే మనసు నిలవదు
నిన్ను ఎలా కొలువగలను ప్రభూ?
ఎలా నిను పూజించగలను?
అంటూ పరితపిస్తున్న
సమయంలోనే.....ఆఖరి క్షణం గడిచిపోయింది