Monday 26 March 2012

ఓ ప్రభూ
పసితనంలో  పాకుతూ  దేకుతూ
పట్టుకున్నవన్ని నోటిలో పెడుతూ        
అమ్మమాటలకూ ఊ కొడుతూ 
నాన్న కోసం  పరుగులెడుతూ
బోసినవ్వులతో ఆనంద పడుతూ
ఆశుద్దాలను ఏకం చేస్తూ ఆటలాడుతూ 
అమాయకంగా కాలం గడిపేసాను
                                               
                                               

కొద్దిగా వయసు పెరిగింది ..
ఇంగ్లీష్ చదువు
ఆరంభమైంది  పుస్తకాలతో కుస్తీ మొదలైంది            
పక్క పిల్లలతో పోటి అలవాటైంది   
అన్నివిషయాలఫై ఆసక్తి మెరుగైంది
ఆలోచన పెరిగింది ఆవేశం పెరిగింది
అతివేగంగా ఆ సమయం కరిగిపోయింది
                                                  



కొంతకాలానికి బాల్యానికి విడ్కోలిస్తూ
కాలేజి జివితాన్ని కాచి వడపోస్తూ
పెద్దల మాటను పెడచెవిన పెడుతూ
అమ్మాయి ప్రేమ కోసం ప్రయత్నిస్తూ
అసలు జీవితం అదేనని తలపోస్తు
ఆమెకోసం అహర్నిశలు కలువరిస్తూ             
అన్నిమరచి నేను పెద్ద తపస్సే చేశాను
ఆ కాలం కలసిరాక చివరకు వదిలేసాను      
                                                  

కొద్దిగా వయసు ముదిరింది 

 బుద్ది మారింది  బాధ్యత పంచుకోమని బలవంతం మొదలైంది   
ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ తప్పనిసరైంది 
 
బవిష్యత్ ఏమవుతుందోనని భయం పెరిగింది          
కాళ్ళు పట్టి కాకా పట్టగా ఉద్యోగం దొరికింది
నా జీవితంఫై నాకు ఒక ఇష్టం ఏర్పడింది         
                                                   
 
పెళ్ళివయసు వచ్చింది అంటూ
పెళ్ళాం కోసం పగటి కలలు కంటూ
ప్రేమించిన దానిని గుర్తు చేసుకుంటూ
వచ్చే అమ్మాయికి ఈ అర్హతలు ఉండాలంటూ            
వయసు పోతుందేమో అని అన్నిటికి ఒప్పుకుంటూ
దొరికిన అమ్మాయినీ  పోనికుండా పట్టుకుంటూ 
దయతో మమగారిచ్చినవి పుచ్చుకుంటూ 
సంసారంలోనే స్వర్గం చూసుకుంటూ
సమయాన్నంతా సందడిగా గడిపాను              
                                             

పిల్లల రాకతో నా సంసారం పెద్దదైంది    
ప్రమోషన్ వచ్చి నా హొదా మారింది
నేనున్డేచోట నా  పరపతి పదిన్తలైంది                    
నాకు డబ్బంటే మోజు మొదలైంది
కనిపించని కష్టం ఇష్టంగా మారింది
సుఖం ఎక్కువైంది రోగం బరువైంది
సమయమెలా సాగిందో తెలియకుంది       
                                                   

పిల్లలు పెద్దవాల్లయ్యారని మురుస్తూ
వారిని చెడిపోకుండా చూస్తూ
నా అనుభావాలను వినిపిస్తూ 
ప్రేమ పేరెత్తకుండా కాపలా కాస్తూ
చదువే సర్వస్వం అని భోదిస్తూ
నే చేసిన పనులను మరుస్తు
అతి సాధారణంగా ఆ సమయం గడిపేసాను
  
పిల్లలు పెద్దమనుషులయ్యారు                                        
నా బాధ్యతలనుంచి  తప్పించారు
నన్ను ఇంటి కాపలవాడిగా మార్చారు
ఓ మూలగా మౌనంగా ఉండమన్నారు 
ముసలాడివి అని మరి చిన్నచూపు చూసారు
సంపాదించినదాన్ని  తగలేస్తున్న
కొడుకుల్ని ఏమనలేక, కోడళ్ళకు చెప్పలేక
చిర్రుబుర్రు మాటలు వింటూ, చివాట్లు తింటూ
చివరి దశకు నే చేరుకున్నాను                 
                                               

ప్రస్తుత పరిస్తితి  నాకు అర్ధమైంది
నా వాళ్లకు నా శరీరం భారమైయ్యింది
నే సంపాదించింది మాత్రం ప్రియమైంది 
నాకంటూ ఎవరు అని ఆలోచన తట్టి లేపింది
నిజమైన  ఆనందం కోసం అన్వేషణ
మొదలైంది
అప్పటికే అంతా ఆలస్యమైయింది
వృద్దాప్యం శరీరానికి భారమైంది

వూహ తెలిసినప్పటినుండి నిన్నెప్పుడు నే కొలవలేదు
కష్టాలు వచ్చినపుడు కాపాడమనీ  కోరుకోవడం తప్ప
అమ్మ రూపంలో లాలించినా
ఆలి రూపంలో ప్రేమించినా
డబ్బు రూపంలో అన్ని ఇచ్చినా 
అంతా నీ అనుగ్రహం అని అర్ధం కాలేదు         
కాలం కలసినంత సేపు కన్ను మిన్ను కానరాలేదు    
కనీసం నిన్ను రోజు తలచుకోలేదు
ఆస్థి అంతస్తు అన్ని ఇచ్చానని
నన్ను ఎవరు గుర్తించటం లేదని
నిత్యం ఏడుస్తున్న నాకు
నా ఏడుపుకు కారణమైన నా పిల్లలకు
 పెద్ద తేడా ఏముంది?                        
                                                    

 నేడు నీకు నేను ఏమి చెయ్యగలను?
నీ కోవెలకు వద్దమంటే కాళ్ళు కదలవు
నీ కధలు చదువుదామంటే కళ్ళు కనబడవు
నీ పురాణాలు వినడానికి చెవులు పనిచేయవు
నీకు నమస్కరించాలంటే  చేతులు లేవలేవు
నీ నామం పలుకుదామంటే నోరు పెగలదు
నిత్యం నిన్నే తలుచుకునే మనసు నిలవదు
నిన్ను ఎలా కొలువగలను ప్రభూ?
ఎలా నిను పూజించగలను?
అంటూ పరితపిస్తున్న
సమయంలోనే.....ఆఖరి క్షణం గడిచిపోయింది

No comments:

Post a Comment