Monday 26 March 2012

   ఏమండోయ్ ఒక్క నిమిషం,                        మీకు నా గతం స్వగతం చెప్పే అవకాశం ఇవ్వండి.            అనగనగ  ఒక రోజు.....

               నాకు ఉద్యోగం రావడం ఖాయం  అని తెలిసి పోయింది.అయితే  ఉద్యోగం ఎక్కడ, ఎవరి దగ్గర అని తెలియడం లేదు.నాకు ఉద్యోగం  ఇచ్చిన యజమాని చాల కఠినుడు  అని మాత్రం తెలుసు.  అది అనుభవ పూర్వకంగా నాకు ముందే అర్ధమయింది ఎందుకంటే  నేను ఉద్యోగంలో ప్రవేశించడానికి ఆయనే ముహూర్తం పెట్టాడు.
              ఊహించనంత పెద్దది నా ఆఫీసు ప్రాంగణం.ఎంత మంది పని చేస్తున్నారో తెలియనంతఎందఱో కొత్తగా ఉద్యోగానికి అడుగు పెడుతున్నారు మరి కొందరు రిటైర్ అయి వెళ్లి పోతున్నారు వచ్చెవాడి మొహంలో ఏడుపు కనపడుతుంటే వెళ్ళే వారు ప్రశాంతంగా వెళుతున్నారు.

              ఉద్యోగంలో చేరిన మొదటి రోజే నా పై ఇద్దరు అధికార్లు వున్నట్టు తెలిసింది ఇద్దరు నాతోనవ్వుతూ మాట్లాడారు నేనీ ఉద్యోగానికి రావటం వారికి చాల ఆనందంగా వున్నది.నా అసలు యజమాని ఎవరో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి వీరే నా యజమానులు.చేరిన సంవత్సరం చాల అనందంగా గడిచింది.నాకు పని ఏమి ఉండేదికాదు వారు ఇద్దరే
నా పని మొత్తం చూసేవారు వారిని నవ్వించడమే నా పని అయింది.
               మొదటి సంవత్సరంలోనే నేను మొహమెత్తానేమో రెండవ సంవత్సరం నుంచి నాకు రూల్స్ పెట్టారు ఆదరణలో తేడా లేకపోయినా ఆంక్షలు మాత్రం పెరిగి పోయాయి నాకేమో నేను పని చేసే ప్రాంగణాన్ని చూడాలని కోరిక కానీ పై అధికార్లు  అనుమతి కొంత వరకు మాత్రమే ఇచ్చారు . వారు అనుమతించినంత వరకు మాత్రమే నాలుగు అడుగులు వీయగాలిగేది నేను కొద్ది కొద్దిగా మాట్లాడడం మొదలు పెట్టాను దాంతో వారు నాకు పాఠం నేర్పించడం మొదలు పెట్టారు.

               ఇప్పుడు నాకు పని పెరిగింది పైన అధికార్లు విధించే పనిష్మెంట్ పెరిగింది ఐన నా అసలు యజమాని ఇంతవరకు కనపడలేదు తరువాత తెలిసిన విషయమేమిటంటే ఇచట కొన్ని వేల మంది కాదు కాదు లక్షలమంది పని చేస్తున్నారు ఎవరికీ ఏవి ఎప్పుడు ముట్టాలో ఆ సమయనికి సరిగా ఆ వ్యక్తికి చేరేవి. శిక్ష కూడా అలాగే వుండేది ఎవరికీ ఎప్పుడు మూడుతుందో  తెలియని    పరిస్థితి. ఉద్యోగంలో చేరడం మాత్రమే మన ఇష్టం చేరిన తరువాత అంతా ఆయన ఇష్టం. ఉంచ దలచుకున్న వాళ్ళను వుంచుతాడు తీసివెయ దలచుకున్న వాళ్ళని నోటీసు లేకుండ తీసివేస్తాడు అందుకే మా యజమాని కఠినాత్ముడు.
                ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇన్ని యేళ్ళలోనూ నా అసలు యజమానిని చూడలేదు నాకు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన కనపడకుండా కనీసం మాట వినపడకుండా అన్ని పనులూ ఆగకుండా జరిగి పోతున్నాయి. ఆయన చాలా గొప్పవాడని
తెలిసింది  నాలాంటి సామాన్యులు తొందరగా కలవలేరని నాకు అర్ధమయింది నా పై అధికార్లు నాకు కోరిన వసతులు కల్పించడం మొదలు పెట్టారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి.

              అకస్మాత్తుగా ఒక రోజు నాపై అధికార్లు వచ్చి నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. నాకు తోడుగా ఒక వ్యక్తిని నియమించారు ఆ వ్యక్తి నాకు అన్ని విధాలుగా సహాయం చేసేవారు నేను మరచిన బాధ్యతలు గుర్తు చేసేవారు మా ఇద్దరి అవగాహనవల్ల  పని సజావుగా సాగిపోతోంది.

              ఇందులో మరియొక సంతోషకరమైన వార్త, నా పై ఇద్దరి అధికార్లకు ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ కుడా మేము ఇద్దరం కష్టపడి పని చేయటంవల్ల వచిందని తెలిపారు ఆ ప్రమోషన్ మాకు కూడా వర్తించింది ఇప్పుడు మేము ఆ ఇద్దరు అధికార్ల స్థాయికి చేరాం  వారు ఇంకా పై స్థాయికి వెళ్లారు.  మేము నవ్వుతు మరియోకడికి స్వాగతం చెప్పాం. ఇలా మరికొన్ని సంవత్సరాలు గడిచాయి.
               ఇన్నాళ్ళలో నాకు తెలిసింది  ఏమిటి అంటే  ఈ ప్రాంగణంలో పనిచేస్తున్న ఎవ్వరు కూడా అసలు యజమానిని చూడలేదని,.కనీసం  మాట్లాడియున్దలేదని ఐనను కొందరు ఈ యజమాని మా మతం వాడని,మా కులం వాడని మా మాటలు మాత్రమే  వింటాడని ప్రచారం మొదలు పెట్టారు.

              ఇంకా మరికొందరు ఒక వ్యక్తిని చూపి ఈయన అసలు యజమాని అంతటి వాడని ఈయనకు అసలు యజమానికి భేదం లేదని అన్ని రకాల సేవలు చెయ్యడం మొదలుపెట్టారు.ఇంతలో మరికొందరు కొత్త నినాదం మొదలుపెట్టారు .అసలు ఈ ప్రాంగణానికి యజమాని అంటూ ఎవరు  లేరని  ఎవరికి వారు యజమాని అని చెపుతువుంటే నాకు చాల భాద కలిగింది.యజమాని అంటూ లేకుండా ఈ ఆఫీసు ఎవరు మొదలు పెట్టారు?  నా  పిచ్చి గాని   ఆయనకు లేని భాద నాకెందుకు?  ఇలా ఉలుకు పలుకు లేకుండా వున్నాడు  అంటే  ఏదో ప్రళయం  రాబోతున్నదేమో అని భయం గాను ఉంది. ఐనను నా భాద్యతను  మరువలేదు.
               ఈలోగా .నా ఫై అధికారులు  నన్ను వదిలి వెళ్లిపోయారు.  వారి పదవులలోకి మేము వచ్చాం. అదేమీ చిత్రమో గాని ఎంత కష్టమొచ్చినా అంత తొందరగా మరిపింప చేస్తుంది ఈ ప్రాంగణం.
అదే విధంగా సంతోషంగా వున్నమనుకునే లోపల అనుకోని అవాంతరాలు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నాకు నా జీవితంపై విసుగు కలుగుతోంది నా బాధ్యతను సక్రమంగా నేరవేర్చినా కూడా నా యజమాని నాకు కనపడకపోవడం నాకు నిరాశను కలగ  చేసింది.
              మరి కొన్ని సంవత్సరాలు గడిచాయి. నా క్రింది ఉద్యోగి పూర్తిగా నా బాధ్యతలు అందుకున్నాడు. ఈ ఆఫీసు ప్రాంగణం ఎప్పుడు వీడ వలసి వస్తుందో తెలియడంలేదు. ముందే చెప్పానుకదా చేరడం , వదలడం అంతా ఆయన ఇష్టమే. ఇంక వుద్యోగంపై విసుగు కలుగుతోంది, వుద్యోగం వదిలి వెళ్ళమంటే వెళ్ళడానికి సిద్దంగా వున్నాను. నా క్రింది ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి మరొకరిని జత కలిపాను. నాకు ఒకటే కోరిక నా అసలు యజమానిని చూడకుండా వుద్యోగం వదలలేను. అందుకే నా సహోద్యోగితో చెప్పాను , ఆయన ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నానని, తెలుసుకునేదాకా నా ప్రయత్నం వదలనని తెలిపాను. అంతే ఆరోజు నుంచీ ఆ ప్రాంగణం అంతా వెతకాలని బయలుదేరాను అలా వెతుకుతూనే వున్నాను ఎందుకంటే ఆ ప్రాంగణానికి అంతులేదు.

               ఆ విధంగా అహోరాత్రాలు సాగాయి. అన్న పానీయాలు మరిచిపోయాను, ఒకటే ధ్యాస, ఒకే ఆలోచన ఆయనెవరో తెలుసుకోవాలని. ఈ విషయంలో నేను ఓడి పోతానేమో నాకు తెలియదు కానీ నా ప్రయత్నం ఆగలేదు . ఒకటే ధ్యాస ఒకటే ఆలోచన ఇలా మరికొన్ని సంవత్సరాలు గడిచాయి నా శక్తీ క్షీణించి పోయింది నేను ఆయనను కలుసుకోవడం మాట అటుంచి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కూడా కష్టమయింది. నేను పూర్తిగా అలసిపోయాను.

             అటువంటి క్షణంలో ఒక అద్భుతం జరిగింది ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు విశాల నేత్రాలతో ఓ ఆజానుబాహుడు నా ఎదురుగా నిలబడి నా హృదయాన్ని తన చేతితో స్పృశించాడు. అంతే కోటి విద్యుత్తరంగాలు నాలో ఎగిసి పడ్డాయి కళ్ళ వెంట కురుస్తున్న ఆనంద భాష్పాలతో తడిసిపోతూ నోరు పెగల్చుకుని 'ఎవరు మీరు?' అని అనాలనుకున్నాను ఇంతలో నువ్వు వెతుకుతున్న యజమానిని నేనే  ఇంతకాలం నీలోనే వున్నాను, నీలోనే కాదు అందరిలోనూ నేనే వున్నాను నీకూ నాకూ బేధం లేదు అన్న మాటలు వినపడ్డాయి.  అంతే అంతులేని బ్రహ్మానందం నా సొంతమయింది తెరలు తెరలుగా సముద్రపు అలలుగా నా ఆనందం పెల్లుబికింది . శివోహం శివోహం అని నా హృదయం ప్రతిధ్వనించింది సమస్త విశ్వం నాలోనే విలీనమయింది. ధన్యోస్మి.

No comments:

Post a Comment