Monday 26 March 2012

అమ్మ

ఓ ప్రభూ,
మా అమ్మ మేనకమ్మ ముద్దులపట్టి
హిమవంతుని గారాల పుత్రి మా పార్వతి
బంగారు గదుల్లో వూయలలూగింది
పట్టుపరుపులపై పవళించేది  మా తల్లి
మయూరాలను చూస్తూ నడకలు నేర్చింది
మంచు ముద్దలతో బంతాటలాడేది
పసిడి కొండలను చూసి పరవశించే మా అమ్మ

పచ్చిక బయళ్ళమీద పరుగులు తీసేది
పూదోటల మధ్య దోబూచులాడే మా తల్లి
పచ్చని చెట్లఫై  మంచు ముత్యాలు వెతికేది
అందమనే దేవతకు అసూయ కలిగించే మా అమ్మ
పాదాలు కందకుండా  ఉండాలని  పుడమి చూసేది

 అతి వయ్యారంగా  సాగే ఆమె నడకను చూసి
అక్కడి నదులు  నవ్వుతూ ఓటమినొప్పుకునేవి
ఎండ కన్నెరగని మా తల్లిని ఏమీ మాయ చేసావో
నిను చూసీ చూడగానే సర్వం మరిచిపోయింది 
అలసటంటూ  అసలు తెలియని మా తల్లి
నిన్నందుకోవాలని పెద్ద తపస్సే చేసింది
ఆమె తపస్సు చూసి అందరూ నివ్వేర పొతే
నదీనదాలు నిక్కి నీలుక్కోని నాపరాళ్ళయ్యాయి
మునులు ఆమె తపస్సును  మహా  మెచ్చుకుంటే
మూగజీవాలు మౌనంగా చూస్తూ రోదించాయి
నెమళ్ళునడకను మరచి నీరసింఛి పోతే
నాలాంటి  సాధుజనులు సర్వం మరిచారు
పరవశించి పరిమళించే పూల మొక్కలు
పలకరించే దిక్కు లేక పక్కకు వాలాయి
మూగగా బాధననుభవిస్తూ మంచు పర్వతాలు
మునపటిలా  మెరవటం  మర్చిపోయాయి
ఇన్ని పరిణామాలు చూస్తూ నేనున్డలేక
ఓ నీలకం
ఠా నిను చూద్దామని వచ్చాను
చూసిన క్షణంనించే మనసు మొద్దుబారి
మాట బయటకు రాక మూగవాడినయాను
నిను ఏమని నేను వర్ణించ గలను?
ఎవరిని నీ గురించి ప్రశ్నించగలను ?
ఒంటి నిండా విభూతిని ధరియించి నీవు
మంచుపర్వతాన్ని మించియున్నావు
కనులకు భీతినిచ్చు కాలనాగులను
కంఠాభరణంగా చేసుకొని తిరుగుతున్నావు

సర్వజీవుల విశ్రాంతి స్థలమగు స్మశానమును
నివాసంగా చేసుకొని మసలుతున్నావు
పట్టు పీతాంబరమువలె పులిచర్మం చుట్టుకొని
పిశాచగణాలతొ పాటు  నీవు  పయనిస్తున్నావు
ప్రపంచాన్ని భస్మిపటలం చేయగలిగినట్టి 
ప్రళయాగ్నిని మూడో నేత్రంగా మూసివుంచావు
పట్టు వీడిన క్షణం ప్రాణం హరింపచేయగల
పె
ద్ద త్రిశూలం చేత ధరించి తిరుగుతున్నావు
భీకరమగు ధ్వనితో భయాన్ని కలిగించు
ఢమరుకముతో  నీవు ఆడుతున్నావు

ఒంటి కన్ను వాడు, మూడు కాళ్ళ వాడు
ముక్కు మూతి లేని వాడు ఒకరు కాదు ఇద్దరు కాదు
వేల వికృత గణాలు నీ చుట్టూ చేరి  వున్నాయి
పరమేశ్వరా పురుషుడినైన  నాకే
పరమ భీతిని కలగచేయుచున్నావు
సకల సద్గుణ రాశి  మా  సొగసుల తల్లి
సాత్విక స్వరూపిణి ఐన మా అమ్మ 
పతిదేవుడుగా నిన్ను ఎలా  కోరుకుందో కదా
నిజం  తనకు తెలియకనేమో లేక
నిజరూపంలో నిన్ను కానకనేమో
నిద్రాహారాలు మాని నిను పూజిస్తుంది
నీకూ నా తల్లికి సరికాదని నీవైనా చెప్పాలిగా
అయినను నిన్నని ఏమి లాభం
నా తల్లి కళ్ళని  నీ విభూతి కప్పింది
సర్వం నీవే కావాలని సన్నిహితులను వదిలేసింది 
సామాన్యుడనైన నా మనవి విని  సమ్మతిస్తుందా
సత్వరం ఈ విషయం అమ్మకు తేలియజేస్తాను
సమస్త విధాలుగా ప్రయత్నించి అమ్మను  నే ఒప్పిస్తాను 
సదాశివా నిను సంపూర్ణంగా మరిచేటట్టు చేస్తాను
ఆవేశంగా అడుగులు ముందుకు వేసాను
ఆలస్యం చేయక అమ్మ దగ్గరకు పరుగు తీసాను
అందరిని కలుపుకొని  మరీ ప్రయత్నించాను
అనుభూతి చెందిన విషయాలు అన్నీ వివరించాను
ఆదిశంకరుడి  అనుగ్రహం అవసరం లేదన్నాను
అసలు ఆ సాంగత్యం నీకు సరిపడదన్నాను
అన్ని మాటలు ఆసక్తిగా ఆలకించింది అమ్మ
అరనిమిషం పాటూ  అందరిని చల్లగా చూసింది
ఆలోచనలకు అందనివ్వలేదు ఆమె అంతరంగం
అంతలో ముద్దులొలికే చిరునవ్వుతో నా తల్లి
మృదు మధురంగా మాట్లాడసాగింది
మాటలను ముత్యాలపేరుగా మార్చి వేసింది

ఓ సాధుజనులారా !                       
సంభోదన సున్నితంగా మనసును మీటింది
స్వీకరించండి నా సాదర ప్రణామాలు
సదాశివుడు సామాన్యుడు కాదు
సమస్త లోక జన పూజితుడు

 
సృష్టి స్థితి సంహార కారకుడు
సర్వం తానై నిండి వున్నాడు
సత్ అసత్ గా నిండి ఉన్నవాడు
పంచభూత పరిపాలకుడు
పరబ్రహ్మగా ప్రకాశించేవాడు
ప్రణవనాధ స్వరూపుడు
పుట్టుకంటూ లేని పరమాత్ముడు
సర్వ జగత్తును ఉదరమందు కలిగినవాడు 
స్మరణ మాత్రం చేతనే సర్వశుభాలనిచ్చేవాడు
సకల ఐశ్వర్యములను చేకుర్చేవాడు
స్వర్గ మోక్షాదులను ప్రసాదించువాడు
...స్వరం గంభీరంగా సాగిపోతుంది
అఖిల భువనములకు అధిపతి
అనంత మైనటువంటి తేజోమూర్తి
అసలు అవగతం కాని విలక్షణ మూర్తి
అపారమైనటువంటి కరుణామూర్తి
అవధులు లేనటువంటి అద్భుతమూర్తి

అందరిలోకి ఆది పురుషుడైనటువంటి 
ఆయనను అర్ధం చేసుకోవడం
అందరివల్లా కాదు

సద్యోజాత, వామ, అఘోర ,తత్పురుష
ఈశాన ముఖాలుగా కలిగిన పరబ్రహ్మ
శ్రీమహావిష్ణువుకు ప్రియమైనవాడు
 
శ్రీకరుడు, శుభకరుడు, శివశంకరుడు
సామవేద ప్రియుడు,శశి శేఖరుడు,
నాదశరీరుడు, నాట్యవినోదు
డైనటువంటి 
ఆయన శివస్వరూపం తెలుసుకోవడం కష్టం
అయినను నాకు తెలిసింది చెపుతాను అంటూ
అమ్మ ఆనందపారవశ్యంతో చెప్పసాగింది
అన్ని ఆలోచనలకు మూలమైనటువంటిది
అందరిని అథపాతాళానికి త్రోక్కివేయగల
కామాన్ని రూపంగా కలిగినటువంటి
మన్మధుడిని దహించివేసేది మూడవకన్ను
కామంవల్ల వచ్చే క్రోధాన్ని అదుపులో
వుంచుకోవాలంటూ సూచించేదే కాలసర్పం
సత్వ, రజ, తమో గుణాలకు
అతీతమైనటువంటి జీవుడు ఎక్కడా లేడు
ఆ గుణత్రయంలోని ఏకత్వమే త్రిశూలం
మనో నిగ్రహం సాధిస్తే సహస్రారం చేరగలమని
సూచించేది శిరమున గల నెలవంక
అహాన్ని జయిస్తేనే
శివోహం గ్రహిస్తాడని
సందేశ రూపకంగా
తెలిపేదే ఆడంబరంగా  కట్టుకున్న వ్యాఘ్ర  చర్మం
మనలోని భయాలను పోగొట్టి
వివేకాన్ని మేలుకోలిపేది,
మహేశ్వరా అని స్మరిస్తేచాలు
మనలను కాపాడటానికి ముందుంటానని
తెలిపేది ఢమరుక నాదం
కాల చక్రంలో కలసిపోయిన
సృష్టికర్త  బ్రహ్మల  సమూహాన్ని
తెలిపేదే ఆ కపాలమాల
సకల ఐశ్వర్యములను సామాన్యంగా
భావించాలని తెలియచేసేది విభూది
అన్నీ వున్నా ఆఖరి గమ్యస్థానం
అదేనని తెలియచేసేది  స్మశానవాసం  

అంతెందుకు ఆయన సాక్షాత్ సృష్టి స్వరూపుడు


శబ్ద స్వరూపమైన  'ఢమరుకం'  'ఆకాశ' తత్వం
శబ్ద,స్పర్శ సంబంధమైన  'ప్రణవం' 'వాయు' తత్వం
శబ్ద,స్పర్శ,రూప తత్వమైన  'త్రినేత్రం'  'అగ్ని' తత్వం
శబ్ద,స్పర్శ,రూప,రస తత్వమైన 'గంగ'  'జల' తత్వం
శబ్ద,స్పర్శ,రూప,రస,గంధ రూపమైన 'విభూది'  'పృథ్వి'  తత్వం
పంచన్మాత్రలు  రూపంగా కలిగిన ఆ పరమేశ్వరుని
వర్ణించటం పరమపవిత్రమైన వేదములవల్లే  కాలేదు
సామాన్యులకది సాహసమైన విషయం
అంటూ శివతత్వం వర్ణించిన ఆ పరాశక్తి మాటలకు


నలు దిక్కులా ఓం  నమఃశివాయ అను
స్మరణతో సర్వజగత్తూ  ఊగిపోయింది
సదా నీ నామస్మరణలో మునిగిపోయింది
నా తప్పును తెలియచెప్పిన నాతల్లికి
శతకోటి ప్రణామాలు తెలియజేసాను
అయీనను ఇందు నా తప్పేమీ లేదు ప్రభూ
అమ్మ చెప్పితేనే గదా  అయ్య గురించి తెలిసేది
అసలు గుట్టు విప్పితేనే కదా అంతా అర్ధమయ్యేది
నీ గురించి నిష్టురమాడితే కదా నిజమేంటో తెలిసింది
నాలాంటి అల్పులకు పూర్తి కనువిప్పు కలిగింది
నేటినుంచి నీ నామస్మరణమే నా శ్వాసగా
నీ సేవనమే నా ప్రాణంగా జీవిస్తాను

శివశివ శంకర  హరహర శంకర
జయజయ శంకర  భోలా శంకర
అను నీ ధ్యానం  నన్ను నీ వాడను చేసి 
సమస్త మంగళాలను కలగచేయాలని
సదాశివా నిన్ను
ఈ హరిశంకరుడు శరణు వేడుకుంటున్నాడు
ఓం నమఃశివాయ.

No comments:

Post a Comment